నవభారత నిర్మాణంలో బొగ్గు రంగానిదే కీలక పాత్ర: కిషన్ రెడ్డి

  • కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ గా బొగ్గు ఉండేదన్న కిషన్ రెడ్డి
  • రూ. 1.86 లక్షల కోట్ల బొగ్గు కుంభకోణాన్ని కాగ్ బట్టబయలు చేసిందని వెల్లడి
  • తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికుల ఆదాయపు పన్ను ప్రభుత్వమే చెల్లిస్తుందని వ్యాఖ్య

నవభారత నిర్మాణంలో బొగ్గు రంగం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ, గత యూపీఏ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ హయాంలో 'బొగ్గు' అంటే కేవలం కుంభకోణాలు, అవినీతి, అనిశ్చితికి మాత్రమే కేరాఫ్ అడ్రస్‌గా మారిందని మండిపడ్డారు.


గత యూపీఏ పాలనలో బొగ్గు శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి జైలుకు కూడా వెళ్లారని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ కాలంలో ఏకంగా రూ. 1.86 లక్షల కోట్ల భారీ బొగ్గు కుంభకోణాన్ని కాగ్ బట్టబయలు చేసిందని, ఆ తర్వాత సుప్రీంకోర్టు సైతం యూపీఏ ప్రభుత్వం కేటాయించిన అన్ని బొగ్గు గనుల కేటాయింపులను రద్దు చేసిందని పేర్కొన్నారు. దీనికి భిన్నంగా, గత 12 ఏళ్ల ఎన్డీయే పాలనలో బొగ్గు రంగాన్ని అవినీతి రహితంగా మార్చామని... ప్రస్తుతం దేశంలో బొగ్గు నిల్వలు రికార్డు స్థాయిలో 189 మిలియన్ టన్నులకు చేరుకున్నాయని తెలిపారు.


భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రస్తుతం 'అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్' (బొగ్గు వాయువుగా మార్చే ప్రక్రియ) పై చురుగ్గా అధ్యయనం చేస్తోందని మంత్రి వెల్లడించారు. దీనిపై ప్రైవేట్ కంపెనీలతో జూన్ 11న ఒక కీలక సమావేశం జరగనుందని, 2028 నాటికి అన్ని బొగ్గు బ్లాకులను మూసివేయాలనే లక్ష్యంతో కేంద్రం పనిచేస్తోందని తెలిపారు. అలాగే క్రిటికల్ మినరల్స్ మిషన్ కింద రూ. 1,500 కోట్లు మంజూరు చేశామని.. ప్రస్తుతం భారతదేశం 24 రకాల కీలక ఖనిజాలను దిగుమతి చేసుకుంటోందని, ఇందులో భాగంగానే అర్జెంటీనాలో 6 క్రిటికల్ మినరల్ బ్లాకులను ప్రభుత్వం దక్కించుకుందని వివరించారు.


రాష్ట్రంలో భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి వస్తే.. సింగరేణి కార్మికులు చెల్లించాల్సిన ఆదాయపు పన్నును ప్రభుత్వమే స్వయంగా చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణలో పార్టీ రాజకీయ ఉనికిని బలోపేతం చేయడంతో పాటు.. అభివృద్ధి, సంక్షేమ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహంలో భాగంగా కేంద్రమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.


G Kishan Reddy
Coal Sector India
Singareni Workers Income Tax
UPA Coal Scam
Critical Minerals Mission
Telangana BJP News

More Telugu News